Friday 8 February 2013

బాల్యం - పల్లెటూరి ఆటలు


బాల్యం
-ఆటపాటల మయం
-అమాయకత్వానికి తార్కాణం
-అల్లరిపనుల గతం

ఎన్నో సరదా ఆటపాటల సమాహారమే బాల్యం.
బాల్యం లో లేనివి - మొహమాటాలు, సిగ్గు-బిడియాలు.
బాల్యం లో వున్నవి - ఆటపాటలు,అలకలు,చిన్న చిన్న కీచులాటలు, నీకెంత వచ్చింది?నాకెంత వచ్చింది?-అనే లెక్కలు, ఏడుపులు,పెడబొబ్బలు.
బాల్యం లో ఎన్నెన్ని ఆటపాటలో. పల్లెటూరి బాల్యం మరిo ప్రియం.
మీరు ఆటలు ఎప్పుడైనా ఆడారా?
గూటీ-బిళ్ళా,కబడ్డీ,కోతి-కొమ్మచ్చి,ఏడుపెంకులాట,పల్లెటూరి-క్రికెట్,దొంగా-పోలీస్,ఖో-ఖో,వైకుంటపాళీ,అష్టా-చమ్మా.... ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు.

గూటీ-బిళ్ళా:
ఇది కర్రలతో ఆడే ఆట.గూటీ అంటే కొంచెం పెద్ద కర్ర, బిళ్ళ అంటే కొంచెం చిన్నదీను. మొదటగా నేలపై ఒక చిన్న కన్నం చెయ్యడం, దానిపై కన్నం మధ్యలో వచ్చేలా బిళ్ళ వుంచడం, కర్రతో బిళ్ళను గాలిలోకి లేపి గట్టిగా దూరంగా పడేలా కొట్టడం. అప్పుడు మొదలౌతుంది లెక్కకట్టడం. బిళ్ళ ఎంతదూరం పడిందో కొలవడానికి ఎన్ని పదాలో! నాకు మాత్రం ఒక పదం 'బండి' గుర్తుంది.'బండి' అంటే 40 కర్రలన్నమాట.

కబడ్డీ:
ఇది జాతీయ స్థాయి లో ఆడే ఆట ఐనా, పల్లెటూరి స్పెషల్ ఏమిటంటే, ఆడేటప్పుడు కూసే కూతలు.
ఉన్నవారంతా రెండు జట్లుగా విడిపోవడం, నేలమీద అడ్డంగా ఒక గీత గీయడం, జట్లు రెండూ చెరొక వైపు నుంచోవడం, మొదటగా ఒక జట్టు నుండి ఒకరిని కూత కోసం అవతలి జట్టు వైపుకి పంపడం. అదుగో అప్పుడే మొదలౌతుంది కూత కథ. కూత కోసం రెండు పదసమూహాలు కావాలి. ఇక్కడ ఎన్ని రకాల కూతలో చెప్పలేను.
కబడ్డీ-కబడ్డీ,కబడ్డీ-కబడ్డీ.... ఇది మామూలు కూతైనా దీన్ని పలకడంలో ఎన్నెనో రకాలు.
ఇక మిగతా కూతల విషయానికొస్తే నాకు చాల తక్కువ గుర్తు వున్నాయి:
ఇడ్డెన్నుముక్క-అరకప్పు టీయ్య ....
అశ్శరభ శరభ-అల్లల్ల వీరా...
మీకెవరికైనా వేరేవి గుర్తు వుంటే కామెంట్స్ లో రాయండి.

పల్లెటూరి-క్రికెట్:
ఇది ఎంత ఇంటర్నేషనల్ గేమ్ అయినా, మేము ఆడింది పక్కా పల్లెటూరి తరహాలోనే. ఎండు కొబ్బరి మట్టలతో బ్యాట్,వికెట్లు తయారు చెయ్యడం, ఇక వాటితో ఎక్కడ పడితే అక్కడ దుకాణం స్టార్ట్ చెయ్యడం. పచ్చి కొబ్బరి మట్టతో చేసిన బ్యాట్ అయితే చాలా బరువు వుండేది. ఎవరైనా చెక్క బ్యాట్ తెస్తే ఆరోజు పండగే.ఇక బాల్ విషయానికి వస్తే, కార్క్ బాలు, రబ్బర్ బాలు, ప్లాస్టిక్ బాలు - ఒక్కటేమిటి అన్ని మనవే. ఇక ఇవేవి లేకపోతే, ఎండు కొబ్బరి చిప్పలు, కొబ్బరి పిందెలు కూడా వదిలేవాళ్ళం కాదు. ఆడుతుంటే బాల్ దగ్గరలో ఉన్న పంట కాల్వ లో పడడం, బాల్ కోసం దానిలోకి ధబాల్న దూకడం, గాజు పెంకులు కాల్లో దిగడం, ఇంటికి ఏడుస్తూ వెళ్లి తిట్లు తినడం మర్చిపోలేను.

ఏడుపెంకులాట: ఏడు పెంకు ముక్కలు ఒక దానిపై ఒకటి పేర్చడం, దూరంగా నుంచుని బాల్ తో వాటిని కొట్టడం, పరిగెత్తడం గుర్తుంది.

సబ్జార్-విండోర్:  పదాల అర్ధం తెలియదు కాని, ఎంత పిచ్చిగా ఆడేవాళ్ళమో. 'కుండ పగిలింది' - అరుపు లేకుండా ఆట ముగిసేదే కాదు. ఆట, దొంగా-పోలీస్ ఆట ఆడేటప్పుడు, వెతికేవాళ్ళను ఎంత ముప్పుతిప్పలు పెట్టేవాళ్ళమో.

టైరు ఆట: ఒక పాత సైకిల్ టైరుని ఒక కర్ర తో తోసుకుంటూ ఊరంతా తిరగడం. రెండు ఎండు తాటి ముంజల మధ్య చిన్న కర్ర గుచ్చి, ఇంకొక పెద్ద కర్రతో దాన్ని తోసుకుంటూ వెళ్ళడం...

కోతి-కొమ్మచ్చి అయితే ఆడినట్టు గుర్తు లేదు కాని, ఎక్కువగా చెట్లపైకి ఎక్కడం, దూకడం, కిందనుండి రాళ్ళు వేసి మామిడి కాయలు కొట్టడం, బండ్ల పైన వెళ్ళే చెరుకు గడలను వెనక నుండి లాగడం, ఒకటేమిటి ఎన్ని కోతిపనులో...

కొన్ని ఆటలైతే, మనలో కొన్ని అవయవాలు పనిచెయ్యకపోతే మనం ఎలా చేస్తామో తెలిపేవి- కుంటాట, కళ్ళగ్గంతలు (కళ్ళకి గంతలు- దీనిని కుంటాట భాషలో చెప్పాలంటే గుడ్డాట అని అనచ్చేమో!), మాట్లాడకుండా చేష్టలతో సినిమా పేర్లు చెప్పడం లాంటివి ఈ కోవలోకి వస్తాయి.
 
ఇక ఇండోర్ గేమ్స్ చెప్పుకోవాలంటే, గవ్వలతో గల గల లాడిస్తూ ఆడే అష్టా-చమ్మవైకుంటపాళీ అయితే ఆడ-మగ,పెద్ద-చిన్న అందరికి సుపరిచితమే.

ఇలా తలచుకుంటూ పోతే, బాల్యం లో సగ భాగం కంటే ఎక్కువ సమయం ఆట పాటలలోనే గడచినట్టు అనిపిస్తోంది..

2 comments:

  1. మా మామగారు శ్రీ కందుకూరి సుబ్రహ్మణ్యం గారి కామెంట్స్:
    "మీరు వ్రాసిన ఆటలలో అంటే చిన్నపుడు వీధి లో అడినవాట్ల లో ఏడు పెంకులాట నాకు గుర్తుంది. పేర్చిన ఏడు పెంకులని బంతితో కొట్టాలి. బంతి దూరంగా పోవాలి. అప్పుడు కొట్టిన టీం వాడు పెంకులను తిరిగి పెరుస్తాడు. ఈ లోపులో రెండవ టీం వాడు బంతి కోసం పరుగెత్తి బంతి తీసి అక్కడి నుండే పేరుస్తున్న వాడిని బంతి విసిరి కొడతాడు . అది తగిలితే అవుట్. లేదంటే బంతి మళ్ళి దూరంగా పోతుంది . పెంకులు పేర్చే వాడు తప్పుకుని మళ్ళి పేర్చు కోవలన్నమాట. ఏమైనా బంతితో చాలా సార్లు వీపులు బద్దలయ్యాయి. బంతులు కుళ్ళు కాల్వలలో పడడం తీసుకొని కడగడము మళ్ళి మళ్ళి ఆడడము మాములే . ఆటలలో శ్రద్ధ బాల్యం అయ్యే దాక పోలేదు"

    ReplyDelete
  2. It's nostalgic to have a touch and go about our childhood games. It is true that we have great memories on these issues after a very long gap of decades went past. Every possible preference was given to such games at the slightest drop of a hat with all the scoldings to take to books of learning. All these games were dead long ago. You will appreciate that the In India, Kabaddi attained National status in 1918 and was included as a demonstration sport at the 1936 Summer Olympics in Berlin and again as a demonstration sport in the 1982 Asian Games in New Delhi. The game was included for the first time in Asian Games held in Beijing in 1990. We are no match to the western part of the world to make a commerce for any game or sport you mention in the the way they are projected for entertainment as well as livelihoods. We are decades behind on this front. Hope we can make big strides gradually.
    Raghu 9177557792

    ReplyDelete